అమరావతి: సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకునే మాఫియా అల్లాడిపోతోందని ప్రతిపక్ష టీడీపీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అత్యవసరాల పేరుతో దోచుకునే అవకాశం కోల్పోయామనేది వీరి ఏడుపని విమర్శించారు. ‘సీఎం జగన్ గారు సీరియస్‌గా లేరట. అత్యవసరాల పేరుతో దోచుకునే అవకాశం కోల్పోయామనేది వీరి ఏడుపు. కరోనా సోకితే ప్రాణం పోయినట్టేనని చెప్పాలట. ఆందోళన చెందొద్దు అని ధైర్యమిస్తే అప్రమత్తంగా లేనట్టట!’ అని ఆయన ట్వీట్ చేశారు.
కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుందని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఐసీయూ బెడ్లు పెంచడం దగ్గర నుంచి దేనికీ కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. అత్యవసర కొనుగోళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పచ్చ పార్టీ ఆర్తనాదాలను పట్టించుకోనవసరం లేదని సూచించారు. ఇక కరోనాను సైతం లెక్క చేయకుండా పని చేస్తున్న వలంటీర్లను అభినందించారు.