మీ హృదయంలోనే దేవుడున్నాడు: రహమాన్‌

ముంబై: మహమ్మారి కరోనాను అరికట్టేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు చెబుతున్నానని సంగీత దిగ్గజం ఏఆర్‌ రహమాన్‌ అన్నారు. అంటువ్యాధిని కట్టడి చేసేందుకు తమ జీవితాలు ప్రమాదంలో పడుతున్నా లెక్కచేయ కృషి చేస్తున్న తీరును అభినందించాలన్నారు. ప్రాణాంతక వైరస్‌తో పోరాడాల్సిన ప్రస్తుత తరుణంలో భేషజాలకు వెళ్లకుండా అంతా కలిసికట్టుగా ఉండాలని సూచించారు. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని.. ఇటువంటి సమయంలో మానవత్వాన్ని పరిమళింపజేయాలని సూచించారు. 




‘‘దేవుడు మీ హృదయంలోనే ఉన్నాడు. కాబట్టి మతపరమైన పవిత్ర స్థలాల్లో గుమిగూడటానికి ఇది సమయం కాదు. ప్రభుత్వం సూచనలను పాటించండి. స్వీయ నిర్బంధంలోకి వెళ్తే మరికొన్నేళ్లు మీరు బతుకవచ్చు. వైరస్‌ను వ్యాప్తి చేయకండి. సాటి మనుషులకు హాని కలిగించకండి. మీకు వైరస్‌ సోకదని అనుకుంటే పెద్ద పొరపాటే. వదంతులు వ్యాప్తి చేసి భయాలను పెంచకండి. దయచేసి జాగరూకతతో మెలగండి. లక్షలాది మంది ప్రాణాలు మన చేతిలో ఉన్నాయి’’అని రహమాన్‌  ఓ నోట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు.(తబ్లిగ్‌ జమాత్‌ : ఆడియో విడుదల)