హైదరాబాద్ : కోవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా సామాజిక దూరం పాటించాలనే సూచనను మనం విధిగా అనుసరిస్తే జూన్ మాసాంతానికి కరోనా మహమ్మారి నుంచి బయటపడతామని, లేని పక్షంలో ఈ ఏడాది చివరి వరకూ దీనిపై పోరాటం తప్పదని సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా అన్నారు. కోవిడ్-19ను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన యాంటీబాడీల అభివృద్ధిపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారని చెప్పారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిశ్రా మాట్లాడుతూ లాక్‌డౌన్‌ను పొడిగించడం లేదా పాక్షిక లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని సూచించారు.
ఇక కరోనా వైరస్ చికిత్సలో మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్వీన్ పనితనంపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, అయితే మహమ్మారిపై ముందుడి పోరాడుతున్న సిబ్బందికి వైరస్ నుంచి రక్షణగా ఈ మందును ఇస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వైరస్ బలహీనంగా ఉందనేందుకు ఆధారాలు లేవని అన్నారు. భారత్‌లో ఇప్పటివరకూ వేయి మందిని పైగా బలిగొన్న కరోనా మహమ్మారి మ్యుటేషన్ కొనసాగుతోందని చెప్పారు. లాక్‌డౌన్ నియంత్రణలు కొనసాగిస్తూనే భారత్‌లో పెద్దసంఖ్యలో పరీక్షలు నిర్వహించాలని, లక్షణాలు లేకుండా వ్యాధి వ్యాప్తి చెందుతున్న క్రమంలో టెస్టింగ్ కీలకమని వ్యాఖ్యానించారు.