నెల్లూరు(బారకాసు): జిల్లాలోని కావలి, గూడూరు డివిజన్లలో గల పలు ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ పట్టనుంది. రూ.22.37 కోట్ల నాబార్డు నిధులతో ఆర్ అండ్ బీ అధికారులు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో రోడ్డు పనులను ప్రారంభించారు. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. త్వరలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) ద్వారా మరికొన్ని ప్రాంతాల్లో రోడ్ల పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారులు చర్యలు ప్రారంభించారు. దీంతో మూడు నెలల్లోపు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రహదారులను సుందరంగా తయారు చేయనున్నారు.
నాబార్డు నుంచి విడుదలైన రూ.22.37 కోట్లతో 8 రోడ్ల పనులు చేపట్టారు. ఇందులో కావలి డివిజన్లో ఆరు, గూడూరు డివిజన్లో రెండు వర్కులు వివిధ దశల్లో ఉన్నాయి. గూడూరు డివిజన్లో ఏర్పేడు నుంచి చెన్నూరు వరకు 3.5 కిలోమీటర్లు, బంగారుపేట నుంచి చెన్నై, కోల్‌కతా రోడ్డు వరకు 4.9 కిలోమీటర్ల మేర తారు రోడ్డు పనులను ప్రారంభించారు. దీనికి రూ.6.85 కోట్లను వెచ్చించారు. కావలి డివిజన్లో ఆరు రోడ్ల పనులకు గానూ రూ.12.52 కోట్లు వెచ్చించారు. ఇందులో రెండు పనులు జరగ్గా, మిగిలిన నాలుగు పనులకు అటవీశాఖ అనుమతులివ్వకపోవడంతో నిలిచిపోయాయి. అల్లూరు నుంచి ఉడ్‌హౌస్‌పేట వరకు మూడు బ్రిడ్జిల పనులు జరుగుతున్నాయి. కావలి నుంచి తుమ్మలపెంట వరకు 0.5 కిలోమీటర్ వరకు రోడ్డు పనులను ఇప్పటికే పూర్తి చేశారు. ఉదయగిరి నుంచి బండగానిపల్లి, తిమ్మసముద్రం నుంచి చోడవరం, జంగాలకండ్రిగ నుంచి చెన్నూరు, కోవూరు నుంచి యల్లాయపాళెం వరకు జరగాల్సిన రోడ్డు పనులు అటవీ శాఖ అనుమతులు లభించక నిలిచిపోయాయి.